రామయ్య: ఏం, బావా, ఏంటి దీర్ఘంగా ఆలోచిస్తున్నావు?
సోమయ్య: ఏం లేదు బావా, ఎవరికి ఓటేద్దామా అని?
రామయ్య: అదేంటి నువ్వు ఫలానా నాయకుడి అభిమానివి కదా?
సోమయ్య: ఏమో బావా, ఆ పార్టీలో వున్నందుకు ఆయన్ని అభిమానించానా లేకపోతే ఆయన వున్నందుకు ఆ పార్టీని అభిమానించానా? చాలా గందరగోళంగా వుంది.
రామయ్య: గందరగోళమేముంది?! ఆ ఆయనకో లేకపోతే ఆయన పాత పార్టీకో వేసేస్తే సరి?
సోమయ్య:
విలువల్లేని పార్టీని వదిలేసి చివరి నిమిషంలో మరో విలువల్లేని పార్టీలోకి
చేరిన విలువల్లేని అభ్యర్థికా? లేకపోతే, విలువల్లేని నాయకుడిని విలువల్లేని
పార్టీలోంచి ఆకర్షించి తీసుకువచ్చిన విలువల్లేని పార్టీకా? లేకపోతే
విలువల్లేని పార్టీతో కొన్ని రోజులుండి బయటకొచ్చి మరో విలువల్లేని పార్టీతో
చేతులుకలిపిన విలువల్లేని పార్టీకా? లేకపోతే.....
రామయ్య: అదికాదు బావా....ఆ పార్టీలోని.....
సోమయ్య:
మొన్న ఏమైంది. మా నాయకుడు గెలిచాడు. ఎగస్పార్టీ వాళ్ళని చూసి గర్వంగా
నవ్వాను. కానీ ఏమైంది ఆయన రెండో రోజుకల్లా ఎగస్పార్టీలోకి మారిపోయాడు. తల
తీసేసినట్టయింది. పోనీ మారితే మారేడనుకున్నాను. కానీ...
రామయ్య: ఏమైంది బావా?
సోమయ్య:
ఏమైందంటావు? ఆ కొత్త పార్టీ ఏ పార్టీతోనైతే మొన్న ఎన్నికలవరకూ వుందో ఆ
పార్టీని వదిలేసి మరో కొత్త పార్టీతో జత కట్టింది. ఆ పార్టీ అంటే అసలే నాకు
చిరాకు. కానీ ఏం చేస్తాం. మౌనంగా వున్నాను. కానీ మరికొన్ని రోజులకే ఆ
పార్టీని వదిలేసి కొత్త పార్టీ మరో పాత పార్టీవైపు మారిపోయింది.
రామయ్య: మరి.....
సోమయ్య:ఉండు
బావా, అసలే చాలా గందరగోళంలో వున్నా. మొన్నటిదాకా ఇంటిమీద ఆయన వున్న పార్టీ
జెండా పెట్టుకున్నా.కానీ ఈయన వేరే పార్టీలోకి మారాక ఆ జెండా పెట్టుకున్నా.
ఆ జెండా వెతుక్కున్న రోజే మా ఎదురింట్లో వున్న మా ఈరకాడు వెటకారంగా
నవ్వాడు. ఆయనింటిమీద ఎగిరిన జెండానే మా ఇంటిమీద పెట్టుకున్నానని.
రామయ్య: మరి ఏం చేసావు?
సోమయ్య:
ఏం చేస్తా. నోర్మూసుకుని ఇంట్లోకొచ్చి పడుకున్నా. సాయంత్రం చూద్దును కదా
ఆయనింటి మీది జెండా మారింది. వాళ్ళ నాయకుడు ఇదివరకు మా నాయకుడున్న
పార్టీలోకి మారాడు కాబట్టి ఆ జెండా పెట్టుకున్నాడు. అప్పుడు నేను నవ్వాను.
ఇంకా వెంటకారంగా. మొహం గంటు పెట్టుకుని ఇంట్లోకి వెళ్ళిపోయాడు.
రామయ్య: పోనీలే మీ తగూలు మీకు వున్నట్టే..
సోమయ్య:
ఆ ఏం ఉన్నట్టులే బావా! పొద్దున్న లేచేసరికి మా నాయకుడి దగ్గరనుంచి ఫోను.
అర్జెంటుగా రమ్మని. కొత్తగా చేరిన పార్టీలో టికెట్ రాలేదని పాత పార్టీలోకే
వెళ్ళిపోతున్నానని వెంటనే ఓ రెండు వెహికల్స్ లో మనుషుల్ని తీసుకుని
ఊరేగింపుకి రమ్మని.
రామయ్య: మరి ఏం చేశావు?
సోమయ్య:
ఏం చేస్తాం? మీ చెల్లికి చెప్పేను. వెంటనే వంటిట్లోకి వెళ్లి మా పాత
పార్టీ జెండా తీసుకొచ్చింది. నిన్న పొద్దున్నే స్టవ్ తుడవడానికి
పెట్టుకుందట. ఇంటిమీద జెండా మళ్ళీ మార్చాను. ఎందుకైనా మంచిదని మార్చిన
జెండాని మడతపెట్టి దాచాను మీ చెల్లికి కనబడకుండా.
రామయ్య: హమ్మయ్య. పోనీలే పాత పార్టీలోకి వచ్చేవు కదా, ఇంకా ఏంటి డల్ గా వున్నావు?
సోమయ్య:
డల్ గా కాకుండా ఇంకెలా ఉండాలి బావా? తాజా మాజీ పార్ నాయకుడొకరు ఫోన్
చేశారు. ఏమయ్యా, నువ్వు ఎన్ని రోజులు జెండా మోస్తావు? నువ్వు మా వైపే
వుండు. మీ ఇంటిమీద మా జెండానే ఎగరెయ్యి. నీకు మాత్రం గ్రోత్ వద్దా? అని
అడిగారు.
రామయ్య: మరి నువ్వేమన్నావు?
సోమయ్య: నేను మారనన్నాను. అదే సంగతి మీ చెల్లికి కూడా చెప్పేను.
మీ
చెల్లి తిట్టిపోసింది. "నీకు సిగ్గులేదు. లజ్జ లేదు. అభిమానం లేదు.
చెడ్డీలు మారుస్తున్నంత సులభంగా పార్టీలు జెండాలు మారుస్తున్నారు. అన్ని
జెండాలు తీసి చెత్త కాల్వలో పడేయ్. మళ్ళీ ఇంకోసారి ఇంట్లకు ఏదైనా జెండా
తెచ్చినవో మంచిగుండదు చెప్తున్న ఇను," అని తిట్టిపోయింది మేడ మీదకి. మరి
నన్నేం చేయమంటావు బావా?
(ఈ లోపల రామయ్య ఫోన్ మోగింది. ఎత్తి మాట్లాడాడు)
సోమయ్య: చెప్పు బావా? ఈ గందరగోళంలో నన్నేం చేయమంటావు?
రామయ్య: ఉండు బావా. ఇప్పుడు నేనేం చేయాలో ఆలోచిస్తున్నాను.
సోమయ్య: ఏమైంది?
రామయ్య: నిన్న వేరే పార్టీలో మారిన మా నాయకుడిని ఇంకో పార్టీ పిలుస్తోందట ఎంపీ టికెట్ ఇస్తా రా అని.
సోమయ్య: మరి ఏం చేస్తావు?
రామయ్య: ఉండు బావా గందరగోళంలో వున్నా. ఏం చెయ్యాలో తెలియడంలేదు.
సోమయ్య: మా చెల్లినడుగు
-- కూర్మనాథ్