November 16, 2016

ఏం!


ఏం, రైతులు త్యాగం చెయ్యడం లేదా మనకోసం? మిమ్మల్ని మేపలేక ప్రాణాలు తీసుకుంటున్నారు కదా?
ఏం, వంటిళ్లలో అమ్మలు, అక్కలు, భార్యలు జీవితాలు నాశనం చేసుకోవడం లేదా, మీరు పీకమొయ్యా తినడానికి అన్నీ సమకూర్చడం లేదా?
ఏం, దళిత, బహుజన స్త్రీలు  చీపుర్లు పట్టుకుని రాత్రుళ్ళు రోడ్లన్నీ శుభ్రం చెయ్యడం లేదా? మీరు కొవ్వెక్కి రోడ్డుమీద పడేసిన చెత్తని ఎత్తడం లేదా?
ఏం, ఇంటింటికీ తిరిగి కూరలమ్మడానికి పొద్దున్నే పిల్లల్ని ఇంట్లో వదిలి, నిద్రని త్యాగం చేసి మండీలకు వెళ్లి రావడం లేదా చిరువ్యాపారులు?
ఏం, పగలనకా, రాత్రనకా, ఎండల్లో వానల్లో బళ్ళమీద కొబ్బరి బొండాలు, అరటిపళ్ళూ, జామపళ్ళూ, సీతాఫలాలూ అమ్మే హాకర్ల కష్టం చూడటం లేదా? 
ఏం, కార్పెంటర్లూ, ఎలెక్ట్రీషియన్లూ, ప్లంబర్లూ, మెకానిక్కులూ, కత్తులు సానబెట్టేవారూ, బట్టలు నేసేవారూ, రోడ్లు వేసే కూలీలూ, పాతపేపర్లు కొనే ముసలి వాళ్ళూ, మిమ్మల్ని ఎక్కడెక్కడికో తిప్పే డ్రైవర్లూ, మీరు ఒళ్ళు కొవ్వెక్కి నానా చెత్తా వేస్తే డ్రైనేజీలు నిండిపోతే రెండో ఆలోచన లేకుండా అందులో ములిగే దళిత శ్రామికులూ, మీ ఇళ్లల్లో నానా మాటలూ పడీ, ఇంట్లోవాళ్ళకి ఆరోగ్యం బాగాలేకపోయినా మీ ఇళ్లల్లో చెత్త తీసుకుని వెళ్లే 'చెత్త' వాళ్ళూ  -- వీళ్ళందరూ త్యాగం చెయ్యడం లేదా?

-- వీళ్ళందరూ చాలీ చాలని ఆదాయాలతో పనిచెయ్యడం వల్లనే, వీళ్ళతో గీచి గీచి బేరమాడడం వల్లనే కదా మీ పర్సుల్లో కొన్ని నోట్లు మిగులుతున్నవి? 

--- వీళ్లందరి సామూహిక శ్రమ వల్లనే కదా మీరు హాయిగా తింటున్నారు, హాయిగా రోడ్లమీద ఉమ్ముతున్నారు, ఆలోచన లేకుండా చెత్తవేస్తున్నారు, హాయిగా ఇంట్లోకూచుని బొర్రలు పెంచుకుంటున్నారు. 


-- ఇంత మంది ఇన్ని రకాలుగా త్యాగం చేస్తే, కష్టం పడితే మీరు హాయిగా నిద్రపోతున్నారు. దేశభక్తి గురించి పాఠాలు చెప్పకు. సరిహద్దు దగ్గర నిల్చున్న (కాశ్మిర్లో దుర్మార్గాలకు పాల్పడుతున్న) సైనికుల కుటుంబాలకు అండగా నిల్చుని వాళ్ళు కూడా హాయిగా నిద్రపోడానికి సహాయపడుతున్న వాళ్ళం.

-- వీళ్ళకి ఇప్పుడు కష్టం వస్తే, వీళ్ళకి ఇప్పుడు జీవనోపాధి పొతే, వీళ్ళే ఇప్పుడు దీనంగా క్యూలలో కూచుంటే, దేశభక్తిలేదని మళ్ళీ వాళ్లనే తిడతావేంట్రా దేశభక్తా? 

No comments:

Post a Comment

ఏ పార్టీలోకి?

రామయ్య: ఏం, బావా, ఏంటి దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? సోమయ్య: ఏం లేదు బావా, ఎవరికి ఓటేద్దామా అని? రామయ్య: అదేంటి నువ్వు ఫలానా నాయకుడి అభి...