March 16, 2017

భూతల స్వర్గం

    కొందరు అనుకుంటారు జర్నలిస్టు బతుకు గొప్పదని. ఇంకొందరనుకుంటారు లంచగొండులనిసిగ్గులేని వాళ్ళనిప్రజల గోస పట్టని వాళ్ళని.
   కానీజర్నలిస్టులకు మాత్రమే తెలుసుఆ బతుకు ఎలాటిదో. తిరగలిలో పడినలిగిలేచి మళ్ళీ పడి -- ఊపిరాడనిఊపిరి తీసుకోలేని బతుకు. రిపోర్టర్ల బతుకు మరింత దుర్భరం. తలమాసిన వాళ్ళుతలపండిన వాళ్ళుమూర్ఖులుదుర్మార్గులురాజకీయనాయకులుదొంగలునటులుపోలీసులుసెలెబ్రిటీలుసెలెబ్రిటీల్ని అరాధించేవాళ్ళుడబ్బున్న వాళ్ళు -- వీళ్ళందరితో వేగాలి. వాళ్ళ చరిత్రలు గుర్తుపెట్టుకోవాలితవ్వితీయాలివాళ్లకి చరిత్రలేక పొతే ఫోటోషాపుతో చరిత్ర సృష్టించాలి.
  ఏదైనా చెయ్యాలికానీ వాళ్ళని హీరోల్లాగా చూపించాలి. వాళ్ళ మాటల్ని పెద్ద హెడ్డింగులతొ రాయాలి. నచ్చని వాళ్ళపై బురద స్టోరీలు రాయాలి. ప్రజల కళ్ళకి తెరలు కట్టాలి. కొన్నిసార్లు గంతలు కట్టాలి.
***
    కళ్ళ ముందు కంప్యూటర్ స్క్రీన్ అలుక్కు పోయి కనిపిస్తొంది. ఓపెన్ చేసిపెట్టిన ఖాళీ డాక్యుమెంట్ నన్ను మింగెయ్యడనికి వచ్చిన ఓ తెల్ల భూతపు నోరులా కనిపిస్తుంది. పదాలు కొదుతున్నాను. డిలీట్ చేస్తున్నాను. కొదుతున్నాను. డిలీట్ చేస్తున్నాను.  పదాలు దొరకదం లేదు. వాక్యాలు కుదరడం లేదు. టైమ్ పరిగెడుతున్నది.
  ఇప్పుడు నేను ముఖ్యమంత్రి ఇంటర్వ్యూ కొట్టాలి. ఆ రోజుకది లీడ్ వార్త మాత్రమే కాదు. లోపల మరో రెండు పుల్ పేజీలు కేటాయించారు. ఓరెండు గంటల్లో మొత్తం నింపాలి.  స్క్రీన్ మీద వాచ్ అదుపు లేకుండా తిరుగుతోంది. అవతలి వైపు నుండి డెస్క్ ఇంచార్జ్ అసహనంగా కదులుతున్నాడు. అప్పటికే ఎన్నోసార్లు అడిగేడు. కనీసం హై లైట్లు చెప్పండి. బాక్స్ లు,  గ్రాఫిక్స్ రెడీ చేసుకుంటాం,” అన్నాడు.
   నా వేళ్ళు కీ బోర్డు మీద మెల్లగా వణకడం నాకు తెలుస్తోంది. హాల్లోని మిగతా నలబైమంది టక టకామని రిపోర్టులు కొడుతున్నారురిపోర్టులను ఎడిట్ చేస్తున్నారు.మాట్లాడుకుంటున్నారు. జోకులేసుకుంటున్నారు. తొమ్మిదవుతోంది.
    ఏం కొట్టాలో తెలియడం లేదు. ఏం చెయ్యాలో తోచడం లేదు.
***
   ఎలా తెలుస్తుందిఇంటర్వ్యూ చేస్తేనే కదా?
   అంటేదొరికితేనే కదా!
   ప్రముఖుల ఇంటర్వ్యూలు అందరికీ దొరకవు. వాళ్లు అనుకున్న వాళ్ళకి మాత్రమే ఇస్తారు. వాళ్ళ పత్రికలకువాళ్లు చెప్పింది రాసే వాళ్ళకేవాళ్ళని ఇబ్బంది పెట్టని ప్రశ్నలని అడగే వాళ్ళనివాళ్ళ కళ్ళు చారడేసి ఉన్నాయని రాసేవాళ్ళని -- వాళ్ళని మాత్రమే పిలుస్తారు.
"సార్ఆయన ఇంటర్వ్యూలు అందరికీ ఇవ్వడం లేదట," అని చెప్పేను ఎడిటర్ కి.
"సంపాదించాలయ్యాసంపాదించాలి. నువ్వేం చేస్తావో తెలీదు. ఎలా చేస్తావో తెలీదుకానీ సాయంత్రానికల్లా  ఇంటర్వ్యూ కావాలి," అన్నాడు.
  ఇక అప్పీల్ లేదు.  డూ ఆర్ డై.
టైం చూసుకున్నాను. మధ్యాహ్నం పన్నెండయింది. ఇక ప్రపంచంలో ఎవరూ కాపాడలేరు నన్ను.  ఏదో ఒకటి చెయ్యాలి. ఎలాగోలా మాట్లాడాలి ఆయనతో. ఎవరి కాళ్ళైనా పట్టుకోవాలి.
నాయకుడి కింద పనిచేసే టీమ్ లీడర్ కి ఫోన్ చేసేను. ఫోన్ ఎత్తలేదు. మళ్లీ చేసేను. మళ్లీ ఎత్తలేదు. వేరే వాళ్ళకి ఫోన్ చేసేను. అధికారం లేనపుడు నాయకుడి ఇంటర్వ్యూ చెయ్యమని నా వెంటతిరిగిననన్ను బతిమాలిన అనుచరుడికి ఫోన్ చేసేను.
"నేను వూళ్ళో లేను సార్," అన్నాడు.
దాని అర్ధం ఊళ్ళో లేనని కాదు. ‘ నీకు ఇంటర్యూ లేదని అర్ధం.    
టైం రెండయ్యింది. 
  ఇక లాభం లేదనుకుని నాయకుడున్న చోటుకి వెళ్ళేను.  ఆఫీసు ముందు ఏడెనిమిది ఒకేరంగుఒకే నంబరు వాహనాలు వున్నాయి.
  ఒకటి కాదుపది ప్రయత్నాలు చేసేను. అన్ని ఉపాయాలూ వాడేను. ఎన్ని నంగిరి మాటలు మాట్లాడాలో అన్ని నంగిరి మాటలూ మాట్లాడేను. పీఏకి ఎన్నికల ముందటి మాటలు గుర్తుచేసేను. ఆయన మాట్లాడిన స్నేహ భాష గుర్తుచేసేను. తప్పించుకుంటున్నాడు. మాట మారుస్తున్నాడు. ఎవరెవరితోనో ఏదో మాట్లాడుతున్నాడు. నా ఉనికిని గుర్తించనట్టు చేస్తున్నాడు.
   నాలుగవుతోంది.
   ఆ పక్కనే తచ్చాడుతున్న ఓ పార్టీ నాయకుడిని అడిగి చూసేను. ఎన్నికల ముందు నాయకుడి దృష్టిలో పడడానికి నాతో వార్తలు రాయించుకున్న సంగతి అన్యాపదేశంగా గుర్తుచేసేను. అర్ధంకానట్టే జవాబిచ్ఛేడు. ఆయనకి అర్ధమయిందని నాకు అర్ధమయిందని ఆయనకి తెలుస్తూనే ఉంది.
  "మాకే దొరకడం లేదు గురూ అప్పాయింట్మెంట్," అన్నాడు.
   నా ముందునుండే ప్రత్యర్థి పేపర్ల రిపోర్టర్లు ఒకరి తర్వాత ఒకరు వెళుతున్నారు. వచ్ఛేస్తున్నారు. నా ప్రయత్నాలు నేను చేస్తూనే వున్నాను.
ఆరవుతోంది.
   కాన్వాయ్ కి దగ్గరలో నుంచున్న సెక్యూరిటీ ఆఫీసరు ఫోన్ రింగయ్యింది. వాకీ టాకీలో ఏదో మెసేజ్ చెప్పేడు. చుట్టుపక్కల నిల్చుని మాట్లాడుకుంటున్న సెక్యూరిటీ వాళ్ళు వాహనాలెక్కడానికి రెడీ అవుతున్నారు.
   అంటేఇక బయలుదేరుతున్నాడు! ఈ రోజుకి ఇక ఇంటర్వ్యూ అవకాశం లేనట్టే. ఈ రోజుతో నాఉద్యోగానికి మూడినట్టే.
    మరో ఐదు నిముషాల్లో చుట్టూ సెక్యూరిటీ వలయంతో బయటకి వచ్చారుఆయన తో పాటు ఒకరిద్దరు మంత్రులూఅధికారులూ -- ఇంకా అప్పటి దాకా ఇంటర్వ్యూ చేసిన వేరే పేపరు జర్నలిస్టు.
    నా వైపు చూసేడు ఆ జర్నలిస్టు. ఆ చూపుకి అర్ధం ఆ చుట్టుపక్కల ఎవరికీ అర్ధం అయే అవకాశం లేదు.
   "ఒరేఅసమర్థుడా. నువ్వు చెయ్యలేదు ఇంటర్వ్యూనేను చేసేను," అని.
   "నాకు ఎక్స్ క్లూజివ్  దొరికిందినీకు దొరకలేదు," అని. 
కానీదగ్గరకొస్తూనేనవ్వుతూ పలకరించి షేక్ హేండ్ ఇచ్చేడు.
    నేనూ పలకరించి చెయ్యి అందిచ్చేను. ఏమీ జరగనట్టుగా నవ్వేను.
    నా నవ్వు చూసి కొంచెం కంగారు పడ్డాడు. నా మొహంలో బాధ లేకపోవడంఆందోళన లేకపోవడంకంగారు లేకపోవడం చూసి కొంచెం తొట్రుపడ్డాడు.
    ఆ జర్నలిస్టుని నన్నూ తోసుకుంటూ సెక్యూరిటీ వాళ్ళు తోవ చేస్తున్నారు నాయకుడు వాహనం ఎక్కడానికి.
   ఆ గుంపులోనే నన్ను చూసేడు. ఇంటర్వ్యూలు చేసే వాళ్ళ లిస్టుని ఆయనే ఫైనలైజ్ చేసి ఉంటాడు. నాపేరు లేకుండా చేసి ఉంటాడు. కానీఆ తొట్రుపాటుఆ గిల్ట్ ఫీలింగ్ ఏమాత్రం లేకుండా నా దగ్గరకు వస్తూనే, "ఏం బ్రదర్ఎలా వున్నారు," అని అడిగేడు. అడుగుతూనే నా భుజమ్మీద చెయ్యివేస్తూ ముందుకు నడిచేడు.
    ఈలోపల సెక్యూరిటీ గార్డు వాహనం ముందు డోర్ తీసి పట్టుకున్నాడు.
  నాకు రగులుతోంది.  గుండెల్లోకడుపులో కాలుతోంది. కానీమనసుని బుద్ధి కంట్రోల్ చేస్తోంది. ఇంటర్వ్యూ లేకుండా వెళ్తే ఎన్ని తిట్లు తినాలో తెలుసుఎన్ని సణుగుళ్లు వినాలో తెలుసు.
     "పొద్దుట్నించీ ఇక్కడ వైట్ చేస్తున్నామీతో మాట్లాడడానికి," అన్నాను.
"హెలికాఫ్టర్ టైం అవుతోంది. చీకటి పడకముందే వెళ్ళాలి. టైం లేదు. ఇంకోసారి చూద్దాం," అన్నాడు.
    “మరి .....”
    "అయ్యోఎవరూ చెప్పలేదే నాకు. కానీ ఇప్పుడు కష్టం. హెలికాఫ్టర్ టైం అవుతోంది. టైం లేదు. ఇంకోసారి చూద్దాం," అన్నాడు.
     తల పట్టుకున్నాను. ఏదో ఒకటి రెండు నిమిషాల టైం దొరికినా (ఇచ్చినా) బాగుండేది. ఇప్పుడెలాఈ గడ్డు సమస్యని ఎలా ఎదుర్కోవాలిఇంటర్యూ ఎవ్వరికీ దొరకకపొతే అదో తీరురెండు పత్రికల్లోవచ్చి మా దగ్గర రాకపోతే ఇక అంతే. “బహుశా రేపే చివరి రొజు ఉద్యోగానికి,” అని అనుకుంటూ ఆఫీసుకి బయల్దేరాను. 
***
    ఆఫీసుకి చేరేసరికి ఏడున్నరయింది. డెస్క్ దగ్గరకి వెళ్లి సిస్టమ్ ఆన్ చేసేను.
    అవతలి వైపునుండి, "ఇంటర్వ్యూ దొరికిందాహైలైట్స్ ఏంటిఎంత పెద్దది కొడతారు," అని అడిగేడు.
   అప్పటికే ఒక నిర్ణయానికి వచ్చి ఉండటంతోఆయన కేబిన్ కి వెళ్లి చెప్పేను. డెస్క్ ఇంచార్జ్ ని పిలిపించాడు. గ్రాఫిక్ డిజైనర్ని పిలిపించాడు.
  "నేనెళ్ళి ఇంటర్వ్యూ ఫైల్ చేస్తానని," చెప్పి లేచేను.
***
  కంప్యూటర్ స్క్రీన్ వైపునోట్స్ వైపు చూస్తున్నాను. టైమ్ ఎన్నడూ లేనంత వేగంగా నడుస్తోంది. ఇక తప్పదు. ఏదో ఒకటి రాసివ్వక తప్పదు. ఎలాగో ఒకలా రాసివ్వక తప్పదు.ఎలాగోలా ఈరోజు గట్టెక్కించక తప్పదు.         మీటింగులకు వెళ్ళిన రిపోర్టర్లు తమకి అర్ధం అయినంత రాస్తారు. లేకపోతేవాళ్ళు చెప్పింది తమకి నచ్చినట్టు లేదా తమ పేపర్ కి నచ్చినట్టు అనువదించి రాస్తారు. అది వేరు. కానీ ఇప్పటి నా పరిస్థితి వేరు. అసలే జరగని ఇంటర్యూని రాయాలి.
    కొంత ముదిరిన జర్నలిస్టులకు అది ఏమంత కష్టం కాదు. Journalism is history in a hurry అని అంటారు.
    కానీ నిజానికి, Journalism is fiction in a hurry. వార్తల్ని కథలు కథలుగా తమకి అనుకూలంగాతమ నాయకుడికి ఇబ్బంది లేకుండా మార్చి రాయడమే జర్నలిజం.
*** 
   ఒక్క క్షణం కళ్ళు మూసుకున్నాను. కళ్ళ ముందు ఉరి తాళ్ళకు వేళాడుతున్న దేహాలుబీళ్ళు పడ్డ వూళ్ళుమసకబారిన ఉదయాలుచారికలు కట్టిన చెంపలు కదిలేయి. నేలనింకిన రక్తపుటేరులు  గుర్తుకొచ్చాయి. కొత్త నగరాలకోసంప్రాజెక్టులకోసం వేళ్ళు తెగిన మనుషులుమునుగుతున్న ఊళ్ళు గుర్తుకొచ్చాయి. వాటిని మరుగునపెట్టే కొత్త కొత్త కథలు  గుర్తొచ్చాయి.
   కళ్ళు తెరిచేను. కొత్త ఫైల్ ఓపెన్ చేసేను.
   ఇక ఏదైతే అదైందని కొట్టడం మొదలు పెట్టేను రిపోర్టు. ఇక ఒకసారి మొదలెట్టేక ఆగకుండా కొడుతునేవున్నాను. ఒక పేజీ నిండగానే కంప్యూటర్ మరో పేజీని తెరుస్తోంది . రెండుమూడునాలుగుఅయిదు  – పేజీలు నిండిపోయాయి. ఇంకా కొడుతూనే వున్నాను.
    రెండున్నర పేజీలకు సరిపడా రిపోర్టులుబాక్స్ అయిటమ్స్ కొట్టి బాస్ కి పంపించేను. డెస్క్ ఇంచార్జితో కలిసి చదువుకున్నాడు. మధ్యలో ఏమైనా సందేహాలొస్తే అడిగి తెలుసుకున్నాడు.
    “అలా అన్నారాఅవునా అది చేస్తానన్నారా? ” అని అడిగేరు. రిపోర్టులు చదివి వాళ్ళ కళ్ళ చివర్లలో మెరుపులు మెరవడం గమనించేను.
    “అవునుఅవునుఅవును,” అని చెప్పేను.
    “ఇక వెళ్ళనా,” అని అడిగేను.
   “ఎడిషన్ అయ్యేదాకా వుండొచ్చు కదా,” అన్నట్టు చూసేడు. కానీ నాకు అర్ఢం కానట్టు  మొహం పెట్టి కొంచెం సేపు అటూ ఇటూ తచ్చాడి ఆఫీసు బయట పడ్డానుఅవసరం వుంటే ఫోన్ చేస్తార్లే అనుకుని.
     ఇంటికెళ్ళేసరికి పిల్లలు నిద్రపోయారుఎప్పటిలాగానే. నేను పొద్దున్న లేచేసరికి వాళ్ళు స్కూల్ కి వెళ్ళిపోతూ వుంటారు. కాళ్ళూ చేతులు కడుక్కుని పాప పక్కకి పోయి పడుకున్నాను. నేను రావడాన్ని గుర్తించినట్టు నిద్రలోనే అటూ ఇటూ జరిగింది.
***  
     ఎప్పుడు నిద్రపట్టిందో తెలీదు. పొద్దున్నే ఫోన్ మోగడంతో తెలివొచ్చింది. ఫోన్ కట్ చెసేను. అప్పటికే నాలుగైదు మిస్డ్ కాల్స్ వున్నాయి. నిన్నటి పీడకల గుర్తొచ్చింది. దొరకని ఇంటర్యూని మేనేజ్ చెయ్యడం గుర్తొచ్చింది. పేపరు చూసి నాయకుడు ఆఫీసుకి ఫొన్ చేసి వుంటాడాతిట్లు తినాలో లేకపోతే ఉద్యోగం పొయిందన్న వార్త వినాలో.  గుండెలోకి ఆ క్షణం వెళ్ళిన రక్తం చల్లగా అనిపించింది.
    గుమ్మం దగ్గర పడివున్న పేపర్లను చేతిలోకి తీసుకున్నానుఅందులోంచి మా పేపర్ పైకి తీసేను.
***
    ఎనిమిది కాలమ్ ల బేనర్ -- భూతల స్వర్గం చేస్తా.
    దానికింద దాదాపు సగం పేజీ వార్త.
    రాష్ట్రాన్ని భూతల స్వర్గం చేస్తానని ముఖ్యమంత్రి ప్రకటించారు. మరో వందేళ్ళు తమ పార్టీనే అధికారంలో ఉంటుందనిమన రాష్ట్ర అభివృద్ది రేటే దేశ అభివృద్ది రేటుగా చెప్పుకుంటారని ఆయన అన్నారు.
    అమెరికాచైనాలు మన రాష్ట్రంతో పోటీ పడేటట్టు చేస్తాననిఇందుకు అందరూ సహకరించాలని 'తెలుగుప్రజ'కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన అన్నారు.
   "ప్రజాసేవ చెయ్యడానికే నేను పుట్టేనని మా నాన్నమ్మ చెప్పేది. అందుకే ఎలాగైనా అధికారంలో వుండే ఏర్పాటు చేసుకుంటాం. మాకు కొంచెం మెజారిటీ వస్తే భయపడుతూ భయపడుతూ ప్రభుత్వాన్ని నడపను. పక్క పార్టీల ఎమ్మెల్యేలకు   ప్రజాసేవ చేసే అవకాశాన్నిచ్చి ఆ పార్టీలన్నింటినీ  ఖాళీ చేయించి  అందర్నీ మా పార్టీలో చేర్పించేసుకుంటా. అందరం కలిసి ప్రజలని ధనవంతుల్ని చేస్తాం," అని అన్నారు.
    "ఎప్పుడూ ప్రజలకు సేవ చేసే వైపే వుంటాను. మా ప్రభుత్వం రైతులది. రైతులదే మా ప్రభుత్వం. అందుకే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే వాళ్లకి ప్రభుత్వ అధికారిక లాంచనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తాం. ఒకవేళ ఎవరైనా ఆత్మహత్యలు చెసుకోవాలనుకుంటే వాళ్ళకి స్వర్ణప్రస్థానం’ పథకం కింద బంగారు ఉరితాడు ఇస్తాంమేమున్న చోట కరువుండదు.  కరువు గురించి మాట్లాడే వాళ్ళు జాతి వ్యతిరేకులు. కరువుల్నివరదల్నితుపానుల్ని మేం జయించెస్తాం.  కరువుందనిఆకలుందని రోడ్లమీద గోతులున్నాయని మాట్లాడేవాళ్ళురాసే వాళ్ళు ప్రజావ్యతిరేకులు. ద్రోహులు," అని అభిప్రాయపడ్డారు.
     "పుట్టిన ప్రతి పసిపాపకి ఓ బంగారు స్పూన్ బహుకరిస్తాను. మహిళలకు వడ్డాణాలు చేయిస్తా. రాష్ట్రంలోని ఈ చివరి నుంచి ఆ చివరివరకు ఫ్లై ఓవర్ కడతాను. కొండలన్నీ చదును చేసి ఆదివాసులకు అపార్ట్ మెంట్లు కట్టిస్తాను. వాళ్ళు ఎన్నాళ్ళు    కొండలమీద గుడిసెలు వేసుకుని బతకాలి. పేదలకి ఏడంతుస్థుల ఇళ్ళు కట్టిస్తా. యువకుల్ని కలెక్టర్లని చేస్తా. యువతుల్ని సీఈవోలని చేస్తా. ఊరికొక విమానాశ్రాయం కట్టిస్తా. ఇవేవీ చెయ్యనివ్వకుండా కొందరు అడ్డుతగులుతున్నారు. రాష్ట్రాన్ని భూతల స్వర్గం చేస్తా," అని గద్గగ స్వరంతో అన్నారు.
     “రైతులు చచ్చిపోతున్నారనీ,  ఇళ్లు లాక్కుంటున్నారనీ,  ఊళ్ళు మునిగిపోతున్నాయనీఉద్యోగాలు దొరకడం లేదనిడబ్బులు తింటున్నామని అన్యాయమైన ఆరోపణలు చేస్తున్నారు.”
......
    వార్త చదవడం ఇంకా అయిపోలేదుఫోన్ మోగింది. ఎవరో మంత్రి చేసేరు. మళ్ళీ మోగింది. ఎవరో చేసేరు. మళ్ళీ మోగింది. వేరే పేపర్లలో ఏం వచ్చిందో చూసుకునే టైం  లేకుండా ఫోన్లు వస్తున్నాయి. నాయకుడి పీఏ నుంచి మిస్సెడ్ కాల్ వుంది.
     "నీకు ఇన్ని విషయాలు చెప్పేడు గురూ. మాతో ఏమీ మాట్లాడలేదు. నీతో ఎప్పుడు మాట్లాడారు," అని పక్క పేపర్లో అదే బీట్ కవర్ చేస్తున్న రిపోర్టర్ ఫోన్ చేసేడు.
    కాసేపటికి మా బాస్ నుంచి ఫోన్. "ఎడిటర్ మాట్లాడతారట," అన్నాడు. ఈసారి టోన్ లో అదిలింపు లేదుఅధికారం లేదు. "బాగుందయ్యా. అన్ని పేపర్లలోనూ మన దగ్గర వచ్చిన ఇంటర్వ్యూనే బాగుంది. ఇన్ని విషయాలు ఎవరికీ చెప్పలేదు."
    చేతిలోని పేపర్లను తీసి పక్కకు పడేసి లేచేను.
    నాకు తెలుసు నా ఇంటర్యూకి రిజాయిండర్  యేమీ రాదని.
***
(Appeared in the Special Issue (Short Stories) of Sahitee Godavari - July-December 2016)

జిస్ దేశ్ మే గంగా బెహతీ హై ....

పాకిస్తాన్ రేడియోలో భారత దేశభక్తి గీతం నేను చూసిన మొట్టమొదటి రాజ్ కపూర్ సినిమాలో పాట. ఏ దేశంలో అయితే నాలుకలపై నిజంమాత్రమే వున్నదో, ఏ...