September 17, 2015

కోరల సింహంగా మారిన కుందేలు కథ


                                                                                                    Sketch: Aman

ఆ రోజు సాయంత్రం అడవిలో పండు వెన్నెల కాచింది.
కుందేలు పిల్ల నాయకత్వంలో క్రూరమైన సింహం చిత్తైన రోజు అడవిలో నెమళ్ళు కొత్త నృత్యం చేసాయి.
ఇంటికో పిల్లని, లేదా తల్లిని, లేదా తండ్రిని మట్టుబెడుతున్న సింహం ఇక లేనందుకు జంతువులకు వేయి పండుగలు ఒకేసారి వచ్చినట్టు అనిపించింది. ఏ రాత్రి ఏ పాలుగారే పాపని పోగొట్టుకోవాలో అని బెంగటిల్లిన తల్లులకు, తండ్రులకు ఆ రాత్రి వాళ్ళు మళ్ళీ పుట్టినట్టు అనిపించి పిల్లల్ని దగ్గరకు తీసుకుని హత్తుకుని తనివితీరా ముద్దుపెట్టుకున్నాయి. పొదివిపట్టుకున్నాయి.
 ఏ రోజు కన్నతండ్రిని, లేదా తల్లిని పోగొట్టుకోవాలో తెలియని భయంలో నిద్రలేని రాత్రులు గడిపిన పిల్లలు కొందరు వాళ్ళ తల్లిదండ్రుల గుండెల్లోకి ఇమిడిపోయారు.
ఆ రాత్రి, మృగరాజు నేలకొరిగిన రాత్రి అక్కడ గొప్ప వేడుక జరిగింది.
తమ బతుకుల్ని చిదిమేసిన, తమ పిల్లల రక్తం తాగిన సింహం రాజు నీట ములిగేక ఆ అడవిలో ఆశల హరివిల్లు విరిసింది. వాళ్లకది యుగాదిలా తోచింది.
ఆ రాత్రి అడవి పూల వర్షం కురిపించింది. మిగతా కుందేళ్ళు వింత గెంతులు గెంతేయి. కోతులు ఏనుగుల వీపులనెక్కి జారుడుబండ జారేయి. నక్కలు ఊళలు మానేసి కూని రాగాలు తీసాయి. ఆ రాత్రి కోకిలలు కొత్త పాటలు పాడేయి.
సింహాన్ని ఓడించిన కుందేలుని జింక పిల్లలు ముద్దు చేసాయి.
చిరకాల శత్రువుని మట్టుపెట్టినందుకు, చీకట్లని తరిమివేసి వేల ఉషస్సులతో మనసుల్ని వెలిగించినందుకు ఎనుబోతు ఒకటి ఆ కుందేలు చెవుల్ని వాటంగా పట్టుకుని ఎత్తుకుని తనివితీరా నిమిరింది.
మృగరాజు చచ్చిన ఆ రాత్రి ఆ అడవిలో గొప్ప కేరింతలు వినబడ్డాయి.
వేలాది జంతువుల రక్తసిక్త ఆక్రందనల్ని మౌనంగా చూసిన మద్ది చెట్లు రెల్లుగడ్డిలా హాయిగా, విలాసంగా  ఊగాయి. వింత ఆకుల చెట్లు, తీగలు గొప్ప సువాసనల్ని వెదజల్లాయి.
అక్కడి పూలుకొన్ని ఆనాడు కొత్త రంగులతో వెన్నెల్లో చిత్రంగా మెరిశాయి.
నిద్రపట్టక ఎగురుతున్న ఓ పిల్ల మబ్బొకటి ఆ ముచ్చట చూసి అక్కడే నిలబడి పోయి చూస్తోంది, ఆ గొప్ప సందడిని చూసి. దాన్ని చూసి మరికొన్ని మబ్బుతునకలు వచ్చి చేరాయి. పచ్చటి వెన్నెల వాటి మీద పడి అవి భారీ విద్యుద్దీపాల వలె ఆకాశాన్ని చల్లగా వెలిగిస్తున్నాయి. చంద్రుడి పిల్లలవలె మెరుస్తున్నాయి.

    ఆ రాత్రి దిక్కులేని జంతువుల్ని అడవితల్లి పొదివిపట్టుకు ముద్దుపెట్టుకుంది.
  ఆ రాత్రి పిల్లల్ని కోల్పోయిన తల్లులు, తల్లుల్ని చూడని పిల్లలు ఇక చావుల్లేని, బెంగల్లేని, భయాల్లేని రోజులొస్తాయని ఆశపడ్డాయి. తమ పిల్లలు హద్దుల్లేని ఉత్సాహంతో గెంతవచ్చని, ఎగరవచ్చని, హాయిగా నదుల్లో ములిగి తేలవచ్చని, అలవికాని హద్దుల్లేని స్వేచ్చతో ముచ్చట్లు పెట్టుకోవచ్చని అని సంతోషించాయి.
   అమావాస్య తొలగిన ఆ రాత్రి, నిద్రలోకి పోబోతూ ఓ లేడిపిల్ల వాళ్ళ అమ్మని అడిగింది, “అమ్మా, మరి నేను రేపు ఈ చివరినుంచి ఆ చివరి వరకూ ఉరుకుతా రేపు మా ఫ్రెండ్స్ తో. నువ్వు అడ్డుచెప్పకు,” అని.
  “సరే
, కన్నమ్మా,” అని ముద్దుపెట్టుకు పడుకోబెట్టింది.
***
సింహాన్ని ఓడించిన కుందేలుకు ధైర్యం రాత్రికి రాత్రే రాలేదు. సింహం దెబ్బకు నలిగిన, సింహం చేతిలో చిత్తయిన ఎన్నో జంతువులు ఆ కుందేలుకు అండగా నిలబడ్డాయి. పాడుబడ్డ నుయ్యి జాడని కుందేలుకి చూపెట్టేయి. ధైర్యం చాలని కుందేలుకి అవే ధైర్యం చెప్పి నడిపించాయి దుర్గమమైన ముళ్ళ మార్గంలో.
పోరాటానికి అదే మొదలు కాదు. ఆ మహారణ్యం భీకరపోరాటాలు చూసింది. ఆ మొక్కలు కొన్ని, ఆ తీగలుకొన్ని, ఆ జంతువులు కొన్ని, ఆ మానులు కొన్ని, ఆ సూదంటు రాళ్ళు కొన్ని అక్కడి పోరాటాలకి సాక్షులు. ఆ అడవికి శత్రువులు కొత్త కాదు.
కుందేలు బంధువులు కొందరు, అడవిగుర్రం తమ్ముళ్ళు కొన్ని, సింహాలు కొన్ని, పులులు కొన్ని, నెమళ్ళ అక్కలు ఇంకొన్ని, దుప్పి తాతలూ, లేళ్ళ పిల్లలూ తమను పీడించే సింహాలతో, పులులతో ఎప్పటినుంచో పోరాడుతూ వున్నాయి.
 ఒక్క మృగరాజే కాదు, తమ రక్తం తాగే, తమ ఉసురు తీసే జంతువుల జాతి మొత్తం ప్రమాదమని, కాటు వేసే, విషప్పురుగులూ ఎప్పటికైనా ప్రమాదమనీ చెప్తున్నాయి. అవి ఆ అడవిలోనే కాదు, ఆ చుట్టుపక్కల అడవుల్లో కూడా అదే చెప్తున్నాయి. పోరాడుతున్నాయి. అవి శత్రువుల వాడి కోరలకి బలయ్యేలోగా, దొంగ దెబ్బలకు పడిపోయేలోగా కొంచెం ధైర్యం, కొంచెం నమ్మకం పిల్లలకి వదిలి పోయేవి. పోతున్నాయి. పిల్లలా ధైర్యాన్ని వారసత్వాన్ని అందుకుని పోరాడుతూనే వున్నాయి. ప్రాణాలు సింహాలకవి ఎన్నడూ భయపడలేదు. పంజదెబ్బలకు పిల్లల్ని చంపివేసే పులులకవి ఏనాడూ వెన్ను చూపించలేదు. అడవి దున్నల వలె అవి కొమ్ముల్ని అడ్డుపెట్టి పోరాడేయి. పోరాడుతున్నాయి. ద్రోహాలకి అవి ఎన్నడూ వెరవలేదు.
ఆ ధైర్యపు తోడుతోనే, ఆ ఉపాయపు మద్దతుతోనే కుందేలు గెలిచింది. మృగరాజుని మట్టుబెట్టింది.
ఆటలన్నీఅయ్యాక, పాటలన్నీ సద్దుమణిగేక, కేరింతలు పూర్తిగా ఆగిపోయాక ఇక నువ్వే మాకు రాజు”వని అక్కడి జంతువులు కుందేలుని అన్నాయి. ఆ కుందేలుకు తెలుసు తనే ఇక రాజునని. ఆ కుందేలుకు తెలుసు ఇక తానే అన్నీ అని. తన మాటకి ఇక తిరుగే లేదని.
***
విషపు పురుగులతో, మాటువేసి దెబ్బతీసి కాల్చుకుతింటున్న, పిల్లల్ని మాయం చేస్తున్న, బతుకుల్ని దుర్భరం చేస్తున్న సింహాలతో, వాటి తొత్తులతో ఎక్కడెక్కడి అడవుల్లో పోరాటం చేస్తున్నలేళ్ళు, నెమళ్లు, కుందేళ్ళు, కొన్ని సింహాలు, ఇంకొన్ని పులులు ఏమరుపాటుగా లేవు.
రాజుల బూజు దులపకపోతే జీవితంలో ఏం మార్పు వస్తుందని అన్నారు.
సింహం చచ్చింది కానీ మన రక్తపు రుచి మరిగిన మిగతా క్రూర మృగాలు హాయిగా తిరుగుతున్నాయని గుర్తు చేశాయి. మనల్ని వేపుకు తినే పొయ్యీ, పెనమూ ఇంకా అలానే వున్నాయి అని చెప్పేయి. ఏం మార్పు వుందని ప్రశ్నించాయి.
సింహం చచ్చింది కానీ దాని అనుయాయులు అలానే వున్నారు కదా అని అడిగాయి.
కుందేలు రాజుకి ఇది నచ్చలేదు. కొత్త మృగరాజుకి ఇది ఇంపుగా అనిపించలేదు.
“వీళ్ళు ఎవరు? ద్రోహులు,” అన్నది.
“వీళ్ళు చచ్చిన సింహానికి దోస్తులు,” అని కూడా ప్రకటించింది. 
సింహం చచ్చిన సంతోషంలో ప్రపంచం మారిపోయిందనుకున్న జంతువులు కొన్ని ఇపుడు రాజ్యం మనదే కదా బాధేమిటని అడిగాయి.
“కాదు, కాదు. రాజు ఎప్పుడూ రాజే. రాజు మనకి ఎన్నడూ శత్రువే. ఆ అడవి అయినా, ఏ అడవి అయినా. పెనం పట్టుకున్న చెయ్యే మారింది కాని, పెనం ఇంకా పొయ్యిమీదే వుందని, మనం ఇంకా పెనంలోనే వున్నామని, అన్ని అడవుల్లోని జంతువులన్నీ చేతులుకలపాలి,” చెప్పేయవి.
ఈ విషయాన్ని మళ్ళీ మళ్ళీ చెప్పాలి, నలుగురికీ, నాలుగు చోట్లా. “మేం చెబుతాం అందరికీ. ఈ అడవిలో, ఆ అడవిలో, ఏ అడవిలోననైనా ప్రజలే రాజ్యం చేయాలని మేం చెబుతాం, పోరాడుతాం,” అని అన్నాయవి.
కుందేలు రాజుకి తెలుసు. చెయ్యిమారిన పెనంగురించి ఎక్కువమందికి తెలిస్తే తన ఆరోగ్యానికి మంచిది కాదని. ఆ ఆలోచనలు నలుగురికి తెలిస్తే కష్టమని దానికి తెలుసు. నలుగురు వింటే కష్టమనీ తెలుసు.
అందుకే చెప్పిందది, “మనం స్వర్గంలో వున్నాం. నరకపు మాటలు వెనకటివి. ఎవరు చెప్పినా వినకండి. ఎవరైనా విందామనుకున్నా, మేం చెప్పనివ్వం. మాట్లాడనివ్వవం. మాది స్వర్గం కాదన్న వాడల్లా ఈ అడవికి శత్రువు. శత్రువుకి మిత్రుడు,” అని ప్రకటించింది.
రాత్రికి రాత్రి, నోరు విప్పిన కుందేళ్లని, మాట్లాడిన పులుల్ని, వాటికి గొంతు కలిపిన లేళ్లని, మాట కలిపిన నెమళ్లను ఎక్కడికక్కడ బంధించింది. కలుగుల్లో, గుహల్లో వుంచింది. వీళ్ళు రాజ్య వ్యతిరేకులు అని ప్రకటించింది. స్వర్గాన్ని కూలదోయడానికి వచ్చిన నరకలోకపు ప్రతినిధులని దండోరా వేయించింది.
ఆ రాత్రి అడవి కొద్దిగా వణికింది.
ఆ రాత్రి అడవిలో పాత రాత్రుల నీడలు నాగుపాముపడగల్లా ఊగాయి.
ఆ రాత్రి అడవిలో పీడకలలు తీతువు పిట్టల్లా అరిచి బయటపెట్టాయి.
అటువైపు వెళ్తున్నమబ్బుల్ని వింత భయాలు చుట్టుకున్నాయి.
ఆ రాత్రి అడివిని పాత స్మృతులు చుట్టుముట్టాయి.
      ఆ పొద్దున్న జంతువులు కలలోంచి బయటికొచ్చాయి.
కుందేలు కోరల సింహంగా మారిపోయిందని అర్ధమయ్యింది జంతువులకు.
పిల్లల్ని దగ్గరకు తీసుకుని పొదివిపట్టుకున్నాయి.
-కె వి కూర్మనాథ్
***

No comments:

Post a Comment

ఏ పార్టీలోకి?

రామయ్య: ఏం, బావా, ఏంటి దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? సోమయ్య: ఏం లేదు బావా, ఎవరికి ఓటేద్దామా అని? రామయ్య: అదేంటి నువ్వు ఫలానా నాయకుడి అభి...