May 02, 2016

సిద్ధాంతాల్ని చంపేసి.. శిలావిగ్రహాలు పెడదామే! (విల్సన్ సుధాకర్ కవిత)

  బుధ్ధుడినీ ఇలానే కలిపేసుకున్నారు. ఆయన్ని ఓ విగ్రహాన్ని చేసేసి, ఆయన చెప్పిన విలువల్ని మంటకలిపేసి, ఆయన్ని ఓ విగ్రహం చేసేసి తమలో కలిపేసుకున్నారు.    ఇప్పుడు ఇక నిస్సిగ్గుగా అంబేద్కర్ ని కలిపేసుకుంటున్నారు. కారంచేడు, చుండూరు, వేంపెంట, ఖైర్లాంజీ, ఇంకా అనేకానేక గ్రామాల్లో, అగ్రహార విద్యాలయాల్లో దళితుల్ని అణచివేసిన రాజ్యం అంబేద్కర్ ని ప్రేమించడం మొదలుపెడుతుంది. 
   అంబేద్కర్ ఎవరికోసమైతే నిలబడ్డాడో, ఎవరి హక్కులకోసమైతే జీవితాంతం పోరాడాడో వాళ్ళని ఓ పక్క అణచివేస్తూనే, మరో వైపు ఆయన విగ్రహాల్ని పెట్టిస్తుంది. ఎవరూ అందుకోలేనంత ఎత్తుకెదిగిన మనిషిని ఓ వంద అడుగులకు కుదించి, ఆయన చూపుడు వేలు ఎటు చూపిస్తుందో అటు ఎవరూ చూడకుండా చేస్తుంది. ఈ ఎత్తుని పసిగట్టిన సుధాకర్ రాసిన కవిత . (ఆంధ్రజ్యోతి, వివిధ, 02-05-2016)


వాళ్ళెలాగూ 
ఆ సజ్జనుడి విగ్రహం పెట్టక తప్పదు 
సజ్జచేలో కంకులపై సహజంగా వాలే పక్షుల్ని 
కర్రలతో కట్టిన మంచె పైనుండి వడిసెల రాళ్ళతో కొట్టి తరిమినట్లు 
పీడితజన పౌరహక్కుల ‘బెల్వెడెరే’గా మారిన లిబర్టీని 
అంబేడ్కర్‌ పేరు తెలియని ఘోరీల పక్కకు తరలిస్తారు 
మనోభావాల్ని 125 అడుగుల ఎత్తున పెంచి పోషించి 
‘జైభీమ్‌’ నినాదాలిస్తూ జయప్రదంగా కోసుకుపోతారు 

బోధి వృక్షం నేనంటే నేనని 
రావిచెట్లు చేసిన ప్రాయోజిత వీధి సత్యాగ్రహంలో సైద్ధాంతిక గాయాలయితే 
ఆ గాయాల్లో వేలుపెట్టి తిప్పిన థామస్‌ నువ్వవుతావు 
ఇప్పటికైనా ఎత్తైన విగ్రహం ముందు నిలబడి చూడు 
నువ్వెంత అల్పుడివో స్పష్టంగా కనబడతావు 

ఉమ్మడి పీడ విరగడయ్యిందనేగానీ 
ఉమ్మడి రాడార్లతో మన పల్లవినే వాళ్లు కనుక్కుని 
ఉభయభ్రష్ట తెలుగులోనే మన సిలువలపై రాగం తీస్తున్నప్పుడు 
నీకు తెలియని ‘అబద్ధపు పేతురు’ నీలో ప్రవేశిస్తే 
ఆ గాన స్రవంతిలో నువ్వొక నేపధ్యవరుసవౌతావు 
మనసుల్లోని మూర్తిమత్వాన్ని అడుగుల్లో కొలుచుకుపోతున్నప్పుడు 
భావజాల వక్రభాష్యంలో విభావరిపై వెలిగిపోతావు 
అస్థిత్వ సారూప్య నాటకంలో మమేకమై ఆంగికమై వాచకమై 
జాతీయ నాటక పాఠశాల విద్యార్థిలా అభినయమౌతావు 
నీ జాతిని ఎరను చేసి మోసగించి గుటుక్కున మింగుతున్నప్పుడు సైతం 
వాగ్దత్తభూమి ఎంతకూ కనబడని ఇవాంజెలికల్‌ ఆంధ్రలోనే మునిగిపోతావు 

నలుగురితో ‘నవయాన’ గనక 
ఏడాదికొకసారి టాంక్‌బండ్‌ మీద షామియానాలు వేస్తారు గనక 
బాదుకున్న గుండెలతో నువ్వు చేసుకున్న ఆత్మవిశ్లేషణల ఆత్మహత్యలు చాలుగానీ 
విస్మరించిన చరిత్రకోసం చేసిన విసుగులేని పోరాటంలో 
ఆయన రాసిన పుస్తకంలో ఒక్క అక్షరానికైనా అర్ధం చెప్పగలవా! 
మూడు పోగుల నీలి సూట్‌లో నిలబడి 
ఒక చూపుడు వేలు ఆకాశంవైపు చూపించే ప్రతిమ 
పార్లమెంటు నుంచి పల్లెటూరు దాకా సర్వవ్యాపిగా ఎలా మారిందో వివరించగలవా! 

అభినవ బోధిసత్వుడిని 
అమరావతి నిత్యకూలీల జరీబు భూముల్లో 
స్థానక భంగిమన కాంస్య విగ్రహం నిలిపితే మాత్రం 
అనంగీకార కత్తితో మాలమాదిగల్ని రెండుగా నరికిన స్తపతి 
శ్రమజీవుల ప్రతిమాశాస్త్రాన్ని రక్త హస్తాలతో ఎలా రచిస్తాడు! 
ఇంకా క్షమాపణలు చెప్పని కారంచేడు కంచికచెర్లల్లో 
విల్లులెక్కుపెట్టిన అంగుళీమాలుర హస్తకళాకౌశలంపై 
శాఖ్యమునులు ఎలా మౌనం వహిస్తారు! 

ఇంట్లో అంబేడ్కర్‌ ఫోటోనైనా పెట్టుకోలేనప్పుడు 
వంటిట్లో మాత్రం నీకోసం కన్నీళ్ళెందుకు విడుస్తాడు! 
ఉద్యమించే దేశబాలలకోసం మద్దతు పలకనివాడు 
దళితుడు-సమాజహితుడు-రోహితాసుతుడు మరణంపై నోరెత్తని వాడు 
సమ్మతం కాని మతపు ‘భూసూక్తం’ దగ్గరుండి చదివించిన వాడు 
బహుజనుల ఉప ప్రణాళికలు పాతిపెట్టే పథకాలకు రిబ్బన కత్తిరిస్తాడు 
ఒక్కసారైనా ఎత్తైన విగ్రహం ముందు నిలబడు 
నువ్వెత అల్పుడివో స్పష్టంగా కనబడతావు 

విగ్రహం పెడుతున్నందుకు ఎవరికెందుకు బాధ! 
భద్రతకు-ఐక్యతకు-విద్యకు-గుర్తుగా 
విస్మరించిన సంస్కృతి చరిత్రలపై పోరాటానికి సాక్ష్యంగా 
విగ్రహం పెడుతున్నందుకెందుకు బాధ! 
విగ్రహమాత్రుడ్ని చేస్తున్నందుకే బాధ!! 

- తుల్లిమల్లి విల్సన్ సుధాకర్‌
                                                                                                  09538053030
లిబర్టీ- టాంక్‌బండ్‌ దగ్గర ఉన్న లిబర్టీ సర్కిల్‌ 
థామస్‌- గాయాల్లో వేలుపెట్టి చూడమని యేసు ప్రభువు తన శిష్యుడు థామస్‌ను కోరతాడు 
(జర్నలిస్ట్‌ మిత్రుడు కె.వీ. కూర్మనాధ్‌ కోసం... తెలుగు రాష్ట్రాల్లో పెట్టనున్న అంబేడ్కర్‌ విగ్రహాలకు మద్దతుగా)

No comments:

Post a Comment

ఏ పార్టీలోకి?

రామయ్య: ఏం, బావా, ఏంటి దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? సోమయ్య: ఏం లేదు బావా, ఎవరికి ఓటేద్దామా అని? రామయ్య: అదేంటి నువ్వు ఫలానా నాయకుడి అభి...