May 06, 2016

కమలిని కథ గురించి ....

    సామాన్య రాసిన కథ నిన్నటి వరకు చదవలేదు -- కల్పన గారు సారంగ లో ఈ కథ మీద చర్చ చేసే దాకా. కథల మీద ఎంత చక్కగా చర్చ చెయ్యవచ్చో, చెయ్యాలో ఈ విమర్శ చెప్తుంది. 
కథ రాసే పద్ధతిపై, నిర్వహించే పద్ధతిపై కథకురాలి స్వేఛ్చని గౌరవిస్తూనే, తన అభిప్రాయాన్ని చెప్పేరు కల్పన.
(సామాన్య కథనీ, కల్పన విమర్శనీ ఇక్కడ చూడవచ్చు, మీరిదివరకే చదివి ఉండకపోతే.)   

http://magazine.saarangabooks.com/2016/04/28/%E0%B0%B8%E0%B0%BE%E0%B0%B0%E0%B1%80-%E0%B0%95%E0%B0%AE%E0%B0%B2%E0%B0%BF%E0%B0%A8%E0%B0%BF%E0%B0%A8%E0%B0%BF-%E0%B0%95%E0%B1%8D%E0%B0%B7%E0%B0%AE%E0%B0%BF%E0%B0%82%E0%B0%9A%E0%B0%B2%E0%B1%87/

వివాహేతర సంబంధంలోకి అనుకోకుండా వెళ్ళిన ఓ మహిళ పశ్చాత్తాపం గురించిన కథ. తనెలాటి పరిస్థితిలో  సంబంధంలోకి వెళ్ళాల్సివస్తుందో సహచరుడికి ఉత్తరం ద్వారా చెప్తుంది కమలిని. 
కథ చదివిన వెయ్యిమంది వెయ్యి రకాలుగా అర్ధం చేసుకుంటారు. వాళ్ళ వాళ్ళ అభిరుచులు, అవగాహన, ప్రాపంచిక దృక్పథం, అనుభవాలు (సొంతవీ, ఎరిగిన వాళ్ళవీ) - ఇలా ఎన్నో అంశాలు ఆధారపడి వుంటాయి అర్ధం చేసుకునే ప్రాసెస్ లో.

  ఇలాటి ఇతివృత్తాలతో ఇంగ్లీషులో, హిందీలో, మలయాళంలో, బెంగాలీలో ఎన్నో కథలు వచ్చాయి. వేయి ముఖాల జీవితంలోని అంతగా వెలుగుపడని అంశాల గురించి సామాన్య రాయడం అభినందనీయం. ఇరవై ఏళ్ల క్రితం ఓం పూరి, రేఖ నటించిన ఆస్థా అని సినిమా ఇలాటి 'పశ్చాత్తాపాన్ని' గొప్పగా డీల్ చేస్తుంది. 
  పురుషుడు వివాహేతర సంబంధాలు పెట్టుకోవడం సామన్యమైపోయి, అవే పనులు స్త్రీలు చేస్తే కొంపలు మునిపోయినట్టు,పవిత్ర భారతీయ సంస్కృతికి అపరాచారం జరిగిపోయినట్టు గగ్గోలు పెట్టడం కొత్త కాదు.
  కమలిని మీద కల్పనకి వున్న విమర్శే నాకు కూడా వున్నది. కల్పన చెప్పినట్టు గానే అది నా సబ్జెక్టివ్ అభిప్రాయం కావచ్చు. ఆమె దీనంగా కాకుండా, బతిమాలుతున్నట్టుగా కాకుండా వుండి వుంటే బాగుంటుందని నాకు అనిపించింది.
వివాహ బంధాల్లో వుండే పరస్పర గౌరవం దెబ్బతిందని ఇద్దరూ, లేదా ఒకరు భావించినపుడు అవి వాటిని ఎలా పరిష్కరించుకుంటారు, పరిష్కరించుకోవాలి అన్న అంశాల మీద ఇదివరకే పెద్ద చర్చలు నడిచాయి. సహచరులను పూర్తిగా అర్ధం చేసుకున్న వారున్నారు. ద్రోహం జరిగిందని భావించి పట్టరాని ఆగ్రహంతో సంబంధాన్ని తెంపుకున్న వారున్నారు.
ఈ కథలో దీపూ కమలినిని అమితంగా ఇష్టపడ్డట్టు, ప్రేమించినట్టు తెలుస్తుంది కానీ, అతడికి  ఏ మేర ప్రజాస్వామిక భావాలున్నాయో  (ఆమెకి ఇష్టమైన ఆహారం తయారుచేసే పని చేస్తుండడం మినహా) మనకి సూచన లేదు.
  లేఖ రాసిన పధ్ధతి మీద కూడా  నాకో విమర్శ వున్నది. లేఖ టోన్ రొమాంటిక్ గా వున్నది. ఇదివరకు సామాన్య లేఖ రూపంలో ఒక కథ రాసేరు (తెలంగాణ ఉద్యమ కాంటెక్స్ట్ లో). ఆ కథ సారంతో నాకు తీవ్రమైన వ్యతిరేకత ఉన్నప్పటికీ ఆ కథకి ఆ లేఖ టోన్ సరిపోయింది.
కానీ, ఈ ఇతివృత్తం రొమాన్స్ కి సంబంధించినది కాదు. ఉద్యోగం చెయ్యాలా వద్దా, ఇల్లు కొనాలా వద్దా లేకపోతే పిల్లలు వుండాలా వద్దా (లేదా అప్పుడే వద్దా ), రాష్ట్రాలుగా విడిపోవాలా వద్దా  లాటి అంశం కాదు. ఇద్దరి (wed lock లో వున్న) మనుషుల మధ్య సంబంధంలో చాల డెలికేట్ అంశానికి సంబంధించిన అంశం. కాబట్టి లేఖ టోన్ భిన్నంగా వుంటే బాగుండేదని నాకనిపించింది. 
కమలిని కొన్ని చోట్ల బోల్డ్ గా ఎసర్టివ్ ఉన్నట్టుగా అనిపించడం వల్ల ఆమె మీక్ గా రాయడం బాగుండలేదు. 
  కథని ఓపెన్ గా వదిలెయ్యడం బాగుంది. లేఖ చదివి ఆయన ఎలా రియాక్ట్ అయ్యాడు, దానికి ఆమె ఎలా స్పందించి వుండేది అని, అప్పుడేమయ్యేది అన్న ప్రశ్నలు పాఠకుడిని వెంటాడుతాయి.

  కల్పన రాసిన ప్రతిస్పందనకి వచ్చిన అభిప్రాయాల్లో కొన్ని అన్యాయంగా వున్నాయి. కథలో రాసిన కొన్ని అంశాలకు రచయిత్రి అభిరుచులకి ఆపాదించడం అన్యాయం, అనుచితం. .

No comments:

Post a Comment

ఏ పార్టీలోకి?

రామయ్య: ఏం, బావా, ఏంటి దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? సోమయ్య: ఏం లేదు బావా, ఎవరికి ఓటేద్దామా అని? రామయ్య: అదేంటి నువ్వు ఫలానా నాయకుడి అభి...